SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 26 July 2026, 12:03 am Posted by : SALAM PRODDATUR

ప్రొద్దుటూరులో ఒంటరిగా నివసిస్తున్న మహిళ మృతి

–ఇంటినుంచి దుర్వాసన రావడంతో వెలుగులోకి ఘటన

సలాం ప్రొద్దుటూరు:

 

ప్రొద్దుటూరులో ఒంటరిగా నివసిస్తున్న ఓ మహిళ మృతదేహం ఇంట్లో కుళ్లిన స్థితిలో కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. దుర్వాసన రావడంతో ఇంటి యజమాని, స్థానికులు వెళ్లి చూడగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.పోలీసుల వివరాల ప్రకారం.. మృతురాలు సుసన్ రాణి (46):కి పది సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వారికి సంతానం లేదు. సుమారు ఆరు సంవత్సరాల క్రితం భర్త సత్యానంద కుమార్ తో మనస్పర్థలు రావడంతో ఇద్దరూ వేరుగా ఉంటున్నారు. గత మూడు సంవత్సరాలుగా సుసన్ రాణి ప్రొద్దుటూరు పట్టణంలోని వసంతపేట రామాలయం కమ్యూనిటీ హాల్ వెనుకవైపు ఉన్న మేడపైన చిన్న ఇంట్లో ఒంటరిగా నివసిస్తోంది.శనివారం ఉదయం నుంచి ఆమె నివసిస్తున్న ఇంటి నుంచి తీవ్ర దుర్వాసన రావడంతో ఇంటి యజమాని, చుట్టుపక్కల వారు పై అంతస్తుకు వెళ్లి పరిశీలించారు. బెడ్‌రూమ్‌లో సుసన్ రాణి మృతదేహం కుళ్లిన స్థితిలో కనిపించింది. మృతదేహం పరిస్థితిని బట్టి ఆమె రెండు మూడు రోజుల క్రితమే మృతి చెందినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు.ఈ ఘటనపై మృతురాలి అక్క హెప్సిబా ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన చెల్లెలి మరణంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిజానిజాలు వెలికితీయాలని కోరారు.దీంతో ప్రొద్దుటూరు వన్‌టౌన్ ఎస్‌ఐ శ్రీనివాసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.