SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 25 July 2026, 12:36 am Posted by : SALAM PRODDATUR

కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి: ఆర్‌ఎస్‌ఎఫ్ డిమాండ్

 

–రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ విజయవంతం.. కడపలో పోలీసుల తీరుపై ఆగ్రహం

 

 సలాం ప్రొద్దుటూరు (కడప):

 

నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని రెవల్యూషనరీ స్టూడెంట్స్ ఫోరం (ఆర్‌ఎస్‌ఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు డి.యం. ఓబులేసు యాదవ్ డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన విద్యాసంస్థల బంద్‌లో భాగంగా కడపలో శుక్రవారం  జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

నీట్ పరీక్ష నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. మంత్రి రాజీనామా చేయకపోతే కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.

కడప జిల్లాలో విద్యాసంస్థల బంద్ విజయవంతమైందని పేర్కొన్న ఆయన, శాంతియుతంగా బంద్ నిర్వహిస్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. విద్యార్థుల హక్కుల కోసం చేపట్టిన ఉద్యమాలను అణచివేయడం తగదన్నారు.

దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు నీట్ పరీక్ష కోసం కష్టపడి సిద్ధమవుతుంటే ప్రశ్నపత్రం లీక్ కావడం వల్ల వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఈ ఘటనతో విద్యార్థులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారని, మృతిచెందిన విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు.

నీట్, నెట్ వంటి జాతీయ స్థాయి పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలు పునరావృతమవుతున్నప్పటికీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఢిల్లీలో నిరసన తెలిపిన విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్‌కు కేంద్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని, మృతిచెందిన నీట్ విద్యార్థుల కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సంఘసేవకుడు సల్లావుద్దీన్, ఆర్‌ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సి. వంశీ, ప్రధాన కార్యదర్శి పి. రెడ్డి సాయి, జిల్లా ఉపాధ్యక్షులు బాలసుందరం, ప్రకాష్, నాయకులు చందు, యశ్వంత్, మధు, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.