SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 25 July 2026, 1:18 am Posted by : SALAM PRODDATUR

నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏఐబీఎస్‌యూ ఆందోళన

 

–ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ – జిల్లా వ్యాప్తంగా బంద్ విజయవంతమైందని జగన్ రాథోడ్ వెల్లడి

 

 

సలాం ప్రొద్దుటూరు ( కడప):

 

 

 

నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఘటన దేశ విద్యా వ్యవస్థపై జరిగిన అతిపెద్ద దాడిగా అభివర్ణిస్తూ కేంద్ర ప్రభుత్వంపై ఆల్ ఇండియా భీమ్ స్టూడెంట్స్ యూనియన్ (AIBSU) రాష్ట్ర అధ్యక్షుడు జగన్ రాథోడ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన విద్యాసంస్థల బంద్‌లో భాగంగా కడపలోని సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజీ వద్ద విద్యార్థులతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు.

 

ఈ సందర్భంగా జగన్ రాథోడ్ మాట్లాడుతూ, లక్షలాది మంది విద్యార్థుల శ్రమ, తల్లిదండ్రుల త్యాగం, యువత భవిష్యత్తు కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదంలో పడిందన్నారు. ఇంతటి తీవ్రమైన వైఫల్యం జరిగినప్పటికీ కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించకుండా తప్పించుకోవడం దురదృష్టకరమని విమర్శించారు.

 

నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి పూర్తి నైతిక, రాజకీయ బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లీకేజీకి కారణమైన వారిని కాపాడే ప్రయత్నాలు మానుకుని, కుట్రలో భాగమైన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

 

విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడే ప్రభుత్వాలకు విద్యార్థులే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించిన ఆయన, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని విద్యార్థులకు న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గబోమన్నారు.

 

అదేవిధంగా, ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పార్టీలు ఈ కీలకమైన అంశంపై మౌనం పాటించడం సిగ్గుచేటని విమర్శించారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో ఉన్నా స్పందించకపోవడం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమని పేర్కొన్నారు.

 

కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నీట్ లీకేజీ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఏఐబీఎస్‌యూ నాయకులు హెచ్చరించారు.