సలాం ప్రొద్దుటూరు (రైల్వే కోడూరు):
రాష్ట్రంలోని అసంఘటిత, ప్రైవేట్ రంగ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 30న తిరుపతి జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న ధర్నాను జయప్రదం చేయాలని సీఐటీయూ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు రైల్వే కోడూరులో సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ నాయకులు సీహెచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని 66 షెడ్యూల్ పరిశ్రమలు, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న సుమారు 50 లక్షల మంది కార్మికులు ఉద్యోగ భద్రత లేకుండా తక్కువ వేతనాలతో జీవనం సాగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గత 20 ఏళ్లుగా కనీస వేతనాల సవరణకు సంబంధించిన జీవో విడుదల చేయకపోవడం వల్ల కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు.
చట్టప్రకారం ప్రతి ఐదేళ్లకోసారి వేతనాలు సవరించాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ బాధ్యతను విస్మరించిందని విమర్శించారు. అన్‌స్కిల్డ్ కార్మికులకు రూ.26 వేల కనీస వేతనం ఇవ్వాల్సి ఉండగా ప్రస్తుతం రూ.8 వేల నుంచి రూ.12 వేల మధ్య మాత్రమే చెల్లిస్తున్నారని తెలిపారు. ధరల పెరుగుదలకు అనుగుణంగా వేతనాలు పెంచకపోవడం కార్మికుల జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు.
లేబర్ కోడ్ల పేరుతో పనిగంటలను 8 గంటల నుంచి 12 గంటలకు పెంచే విధానాలు అమలులోకి వస్తే, అదనపు పని చేసినా ఓవర్‌టైం ప్రయోజనాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కనీస వేతనాలను 60 శాతం పెంచి అన్‌స్కిల్డ్ కార్మికులకు రూ.24 వేలు, నైపుణ్యం కలిగిన కార్మికులకు రూ.32 వేలకుపైగా చెల్లిస్తోందని గుర్తు చేశారు.
కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, కార్యాలయాలు, షాపులు, ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులు ఈనెల 30న తిరుపతి జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అలాగే ఈనెల 31న అంగన్‌వాడీ, వీవోఏ యానిమేటర్లు, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు తదితర స్కీం వర్కర్లకు రూ.26 వేల కనీస వేతనం, రెగ్యులరైజేషన్‌తో పాటు ఇతర సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే కార్యక్రమాలను కూడా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఐటీయూ నియోజకవర్గ సమన్వయ కమిటీ కన్వీనర్ ఆర్. వెంకటేష్, మండల కన్వీనర్లు పి. జాను ప్రసాద్, వై. సుజాత, బి. శిరీష, నాగిపోగు పెంచలయ్య, అంగన్‌వాడీ ప్రాజెక్టు కార్యదర్శి ఎస్. శ్రీలక్ష్మి, వీవోఏ సంఘం జిల్లా నాయకులు నగిరిపాటి ఆనంద్, కేవీపీఎస్ నాయకులు ఓబిలి పెంచలయ్య, హరి నారాయణ తదితరులు పాల్గొన్నారు.