SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 22 July 2026, 7:44 pm Posted by : SALAM PRODDATUR

రైతు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలి– ఎమ్మెల్యే వరద

సలాం ప్రొద్దుటూరు:

నీటి కొరత కారణంగా అనేక ప్రాంతాల్లో రైతులు పంటలు సాగు చేయలేని పరిస్థితి నెలకొందని, వర్షాల కోసం ఎదురుచూస్తున్నారని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి అన్నారు. బుధవారం నెహ్రూ రోడ్డులోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

పశువులకు మేత కొరత కూడా తీవ్రంగా ఉందని, రైతులతో పాటు వ్యవసాయ కూలీలు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం రైతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.

‘తల్లికి వందనం’తో ప్రతి విద్యార్థికి లబ్ధి

కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న “తల్లికి వందనం” పథకం ద్వారా ఇంట్లో చదువుకుంటున్న ప్రతి విద్యార్థికి ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం “అమ్మ ఒడి” పేరుతో ఒకరికే పరిమితం చేసి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని, 2029 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. వైసీపీ పాలనలో ఆర్థికంగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరిగి గాడిలో పెడుతున్నారని పేర్కొన్నారు.

రైతులకు విక్రయించే ఎరువులు, యూరియాను అధిక ధరలకు అమ్ముతున్నారనే ఫిర్యాదులపై సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకుని ధరలను నియంత్రించాలని ఎమ్మెల్యే కోరారు.

ఈ సమావేశంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు చల్లా రాజగోపాల్ యాదవ్, మాజీ కౌన్సిలర్ వంగనూరు మురళీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.