సలాం ప్రొద్దుటూరు (వనపర్తి):
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా విద్యారంగంలో మూడు దశాబ్దాలకు పైగా విశిష్ట సేవలందించిన ప్రముఖ ఉపాధ్యాయిని ఎనుముల జయమ్మ సోమవారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా వనపర్తి పట్టణంలోని దక్ష లక్ష్మయ్య ఫంక్షన్ హాల్లో ఆమెకు ఘనంగా పదవీ విరమణ సన్మానోత్సవాన్ని నిర్వహించారు.
ఎనుముల జయమ్మ 1989 సంవత్సరంలో స్పెషల్ టీచర్‌గా ప్రభుత్వ విద్యాశాఖలో తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. అనంతరం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పలు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో సుమారు 36 సంవత్సరాల పాటు ఉపాధ్యాయినిగా సేవలందించారు. అనంతరం ఎల్.ఎఫ్.ఎల్ ప్రధానోపాధ్యాయినిగా బాధ్యతలు నిర్వహించి విశిష్ట సేవల అనంతరం పదవీ విరమణ పొందారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన పాటల కచేరీలో ఎనుముల జయమ్మ స్వయంగా తన మధుర గాత్రంతో పలు గీతాలను ఆలపించి సభికులను అలరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కొత్తకోట మండల విద్యాశాఖ అధికారి జే. కృష్ణయ్య మాట్లాడుతూ, ఉపాధ్యాయ వృత్తి అత్యంత పవిత్రమైనదని, ఎనుముల జయమ్మ తన ఉద్యోగ జీవితమంతా విద్యార్థుల అభివృద్ధి, పాఠశాలల పురోగతి కోసం అంకితభావంతో పనిచేశారని కొనియాడారు.
పదవీ విరమణ పొందుతున్న ఎనుముల జయమ్మ భావోద్వేగంతో మాట్లాడుతూ, 36 సంవత్సరాల తన ఉద్యోగ జీవితంలో తనకు సహకరించిన విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, సహచర ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయ వృత్తి తన జీవితానికి ఎంతో సంతృప్తిని ఇచ్చిందని, విద్యార్థుల ప్రేమాభిమానాలే తనకు గొప్ప సంపదగా భావిస్తున్నానని పేర్కొన్నారు.
అనంతరం ఎనుముల జయమ్మ, ఆమె భర్త టి. సుదర్శన్ రెడ్డి దంపతులను శాలువాలతో సత్కరించి, పూలహారాలు వేసి, జ్ఞాపికలు అందజేసి ఘనంగా సన్మానించారు. సభలో పలువురు ఉపాధ్యాయులు, సహచరులు, శిష్యులు జయమ్మతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆమె సేవలను కొనియాడారు. ఆమె భవిష్యత్ జీవితం ఆనందమయం కావాలని శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు టి. వివేకానంద, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఎనుముల జయమ్మ సోదరుడు ఎనుముల హేమసుందర్ రెడ్డి, వదిన భారతి రెడ్డి, మేనల్లుడు దినేష్, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సహచర ఉపాధ్యాయులు, శిష్యులు మరియు శ్రేయోభిలాషులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.