SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 21 July 2026, 10:09 pm Posted by : SALAM PRODDATUR

80 శాతం పూర్తై నిలిచిన 33/11 కేవీ సబ్‌స్టేషన్ పనులు పూర్తి చేయాలి: ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి

–జూలై 25న తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు పిలుపు

 

సలాం ప్రొద్దుటూరు:

 

ప్రొద్దుటూరు శ్రీనివాసనగర్‌లో నిర్మాణంలో ఉన్న 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ పనులు 80 శాతం పూర్తయిన తర్వాత నిలిచిపోవడంపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మిగిలిన 20 శాతం నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని పలుమార్లు అధికారులను కోరినా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సబ్‌స్టేషన్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు ప్రొద్దుటూరు తహశీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ధర్నా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయం మంగళవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపింది.

ప్రొద్దుటూరు పట్టణంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ సబ్‌స్టేషన్ నిర్మాణం కీలకమని, పనులు నిలిచిపోవడం వల్ల ప్రజలకు ఆశించిన ప్రయోజనాలు అందడం లేదని ప్రకటనలో పేర్కొన్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి మిగిలిన నిర్మాణ పనులను ప్రారంభించి సబ్‌స్టేషన్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి డిమాండ్ చేశారు.

జూలై 25న నిర్వహించే ధర్నాలో ప్రజలు, పార్టీ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్యే కార్యాలయం విజ్ఞప్తి చేసింది.