సలాం ప్రొద్దుటూరు:
వై ఎస్ ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో దస్తావేజుల లేఖరులు జి.ఓ. నెం. 396ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. స్థానిక సబ్-రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా దస్తావేజుల లేఖరుల సంఘం అధ్యక్షుడు జమాల్ మాట్లాడుతూ, బ్రిటిష్ కాలం నుంచి దస్తావేజుల లేఖరులుగా జీవనం సాగిస్తున్న తమకు ప్రభుత్వం తీసుకొచ్చిన జి.ఓ. నెం. 396 తీవ్ర అన్యాయం చేస్తోందని అన్నారు. ఈ జి.ఓ. అమలులోకి వస్తే తమ ఉపాధి దెబ్బతిని వందలాది కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం వెంటనే జి.ఓ. నెం. 396ను రద్దు చేసి దస్తావేజుల లేఖరుల జీవనోపాధిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. తమ సమస్య పరిష్కారం అయ్యే వరకు నిరవధిక సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో స్టాంప్ రైటర్స్ సంఘం అధ్యక్షుడు జమాల్‌తో పాటు ముని శేఖర్, రమేష్, సుభాష్, జనార్దన్, నారాయణ, పవన్, నాగరాజు తదితర దస్తావేజుల లేఖరులు పాల్గొన్నారు.