సలాం ప్రొద్దుటూరు (బద్వేల్):
వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు పట్టణంలోని మార్తోమా నగర్‌లో మూడు సెంట్ల ఇంటి స్థలానికి సంబంధించి బద్వేలుకు చెందిన పిన్నం వెంకటయ్య, ప్రొద్దుటూరుకు చెందిన అయ్యవారమ్మ తదితరుల మధ్య కొంతకాలంగా భూ వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో జూలై 18 సాయంత్రం పిన్నం వెంకటయ్యకు, అయ్యవారమ్మ వద్ద నుంచి స్థలాన్ని కొనుగోలు చేసినట్లు చెప్పబడుతున్న కడపకు చెందిన బొజ్జా తిరుమలేష్ తదితరుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
సమాచారం అందుకున్న వెంటనే బద్వేలు టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఇరు వర్గాలను అక్కడి నుంచి పంపించి శాంతిభద్రతలను పునరుద్ధరించారు.
ఈ ఘటనపై బద్వేలు అర్బన్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 106/2026గా, భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 194(2) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోందని, దర్యాప్తులో వెలుగులోకి వచ్చే ఆధారాల మేరకు సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఈ ఘటనను వక్రీకరిస్తూ ఒక మహిళ దుస్తులు చించి అవమానించినట్లు కొన్ని టెలివిజన్ ఛానళ్లు, సామాజిక మాధ్యమాల్లో వీడియోలు ప్రసారం కావడంపై పోలీసులు స్పందించారు. విచారణలో మహిళ దుస్తులు చింపడం గానీ, ఆమెను అవమానించే విధంగా ఎలాంటి ఘటన చోటుచేసుకోలేదని స్పష్టం చేశారు. ఈ ప్రచారం పూర్తిగా నిరాధారమని, వాస్తవాలకు విరుద్ధమని వెల్లడించారు.
భూ వివాదాన్ని వక్రీకరించి మహిళ గౌరవానికి భంగం కలిగించినట్లు తప్పుడు ప్రచారం చేయడం వల్ల ప్రజల్లో అపోహలు, విద్వేషాలు రెచ్చగొట్టే అవకాశం ఉందని మైదుకూరు డీఎస్పీ జి. రాజేంద్ర ప్రసాద్ హెచ్చరించారు. ఇటువంటి అసత్య, కల్పిత కథనాలను ప్రసారం చేయడం లేదా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడం చట్టరీత్యా శిక్షార్హమైన చర్య అని పేర్కొన్నారు.
ప్రజలు, మీడియా ప్రతినిధులు ఏ సమాచారాన్నైనా సంబంధిత అధికారుల ద్వారా ధృవీకరించుకున్న తర్వాతే ప్రచారం చేయాలని, నిరాధార వార్తలను నమ్మకుండా, వాటిని సామాజిక మాధ్యమాల్లో పంచుకోకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు.