SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 19 July 2026, 5:07 pm Posted by : SALAM PRODDATUR

ఉదయాన్నే మద్యం దుకాణాలు తెరిచి అధిక ధరలకు విక్రయాలు..

 

–అధికారుల నిర్లక్ష్యంపై ఐద్వా ఆగ్రహం

 

సలాం ప్రొద్దుటూరు:

ప్రొద్దుటూరు పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా తెల్లవారుజామునే మద్యం, బార్ దుకాణాలు తెరిచి అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఐద్వా (AIDWA) నాయకులు ఆరోపించారు.

 

ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఐద్వా పట్టణ కార్యదర్శి జి. ప్రేమ, అధ్యక్షురాలు వై. విజయమ్మ మాట్లాడుతూ, ఉదయం 11 గంటలకు తెరవాల్సిన బ్రాందీ షాపులు తెల్లవారుజామునే 5–6 గంటల నుంచే కార్యకలాపాలు ప్రారంభించి అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నాయని విమర్శించారు. దీనిపై పలుమార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

 

మద్యం, మాదకద్రవ్యాల వ్యసనాల కారణంగా యువత చిన్న వయస్సులోనే జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, కుటుంబాలు విచ్ఛిన్నమై భార్యాభర్తలు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆదివారాల్లో మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరిగి అనేక కుటుంబాలు తమ ఆత్మీయులను కోల్పోతున్నాయని అన్నారు.

 

ప్రభుత్వం మద్యం దుకాణాలను వీధివీధిలో ఏర్పాటు చేసి కోట్ల రూపాయల ఆదాయం పొందుతున్నప్పటికీ, మద్యం కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నష్టపరిహారం అందించడంలో విఫలమవుతోందని విమర్శించారు. మద్యం కారణంగా మరణించిన ప్రతి వ్యక్తి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ప్రకటించి ఆదుకోవాలని ఐద్వా ప్రొద్దుటూరు పట్టణ కమిటీ డిమాండ్ చేసింది.

 

ఈ సమస్యలపై నిరసనగా జూలై 21, మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రొద్దుటూరులోని రాజీవ్ సర్కిల్ వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించనున్నట్లు నాయకులు ప్రకటించారు.

 

ఈ విలేకరుల సమావేశంలో చెన్నమ్మ తదితరులు పాల్గొన్నారు.