–4 కిలోల గంజాయి, రూ.3 వేల నగదు స్వాధీనం
సలాం ప్రొద్దుటూరు:
గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను ప్రొద్దుటూరు III టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 4 కిలోల గంజాయి, రూ.3 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసుల వివరాల మేరకు.. ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డులోని బొల్లవరం వెంకటేశ్వరస్వామి గుడికి ఉత్తర వైపున ఉన్న కాలువకట్ట సమీపంలో శనివారం సాయంత్రం గంజాయి విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో III టౌన్ సీఐ రామాంజనేయుడు, ఎస్ఐలు సంజీవరెడ్డి, మైనుద్దీన్ లు నిఘా ఏర్పాటు చేశారు. గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా.. వారి వద్ద 4 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. దీంతో గంజాయితో పాటు రూ.3 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టయిన వారిలో వైఎస్సార్ జిల్లా చాపాడు మండలం వెదురూరు రాజుపాలెం గ్రామానికి చెందిన గాలం సిద్ధయ్య అలియాస్ శివ (26), కమలాపురం మండలం పెద్ద చెప్పలి కి చెందిన ఉడిమిళ్ల శ్రీనివాసులు అలియాస్ వాసు (26), నెల్లూరు జిల్లా బోగోలు మండలం బీట్రుగుంట గ్రామానికి చెందిన బాణాల సువార్త (36) ఉన్నారు.
విచారణలో నిందితురాలు బాణాల సువార్త అనే మహిళ ఒరిస్సా రాష్ట్రంలోని రాయగడ ప్రాంతం నుంచి గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి.. ప్రొద్దుటూరుకు తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గంజాయిని చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి విక్రయిస్తూ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. .
యువత గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటి విక్రయాలు లేదా వినియోగంపై సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని అధికారులు సూచించారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని స్పష్టం చేశారు.