SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 16 July 2026, 7:15 pm Posted by : SALAM PRODDATUR

రాచమల్లు నోరు అదుపులో పెట్టుకో..లోకేష్ గురించి మరోసారి మాట్లాడితే ఖబర్దార్

–రాచమల్లుపై ఉక్కు ప్రవీణ్ ఫైర్

 

–బహిరంగ చర్చకు సవాల్

 

సలాం ప్రొద్దుటూరు:

మంత్రి నారా లోకేష్‌ పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే రాచమల్లు చేసిన వ్యాఖ్యలకు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఉక్కు ప్రవీణ్ ఘాటుగా స్పందించారు. లోకేష్‌ను ఉద్దేశించి మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని హెచ్చరిస్తూ,రాచమల్లు నోరు అదుపులో పెట్టుకో “లోకేష్ గురించి మరోసారి మాట్లాడితే ఖబర్దార్” అని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. గురువారం వై ఎం ఆర్ కాలనీ లో టిడిపి నేత ప్రవీణ్ స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

లోకేష్ ప్రజా సేవ, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించి పనిచేస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయ విమర్శలు విధానాలపై ఉండాలని, వ్యక్తిగత దూషణలు, ఆధారంలేని ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. లోకేష్‌పై అసత్య ప్రచారం లేదా వ్యక్తిగత విమర్శలు కొనసాగితే తెలుగుదేశం పార్టీ శ్రేణులు తగిన విధంగా స్పందిస్తాయని ఉక్కు ప్రవీణ్ హెచ్చరించారు.

రాయలసీమ అభివృద్ధిపై మాట్లాడే ముందు వైసీపీ హయాంలో జరిగిన పనులను ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాయలసీమకు ఏ ప్రధాన పరిశ్రమలు లేదా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకువచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు.

టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కియా పరిశ్రమ, ప్రస్తుతం విస్తరిస్తున్న దాల్మియా సిమెంట్ రెండో దశ ప్లాంట్, అలాగే స్టీల్ ప్లాంట్ వంటి పరిశ్రమల ప్రస్తావన చేస్తూ, ఇవి రాయలసీమలో ఉపాధి అవకాశాలు పెంచే ప్రాజెక్టులని పేర్కొన్నారు. దాల్మియా సంస్థ ప్రతినిధులు కూడా మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగానే శంకుస్థాపన జరిగిందని, ప్రారంభోత్సవం కూడా ఆయన చేతుల మీదుగానే జరగాలని కోరుకున్నారని తెలిపారు.

నారా లోకేష్ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలను కలుస్తూ పార్టీని బలోపేతం చేసే దిశగా పనిచేస్తున్నారని, వైసీపీ హయాంలో ఇలాంటి కార్యకర్తల సమావేశాలు నిర్వహించారా అని ప్రశ్నించారు.

మంత్రి నారా లోకేష్‌పై వ్యక్తిగత విమర్శలు చేయకుండా అభివృద్ధి, పాలన అంశాలపై బహిరంగ చర్చకు రావాలని రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి సవాల్ విసిరారు. రాష్ట్రం, రాయలసీమ అభివృద్ధి విషయంలో టీడీపీ ప్రభుత్వం చేసిన పనులు, వైసీపీ ప్రభుత్వం చేసిన పనులపై ప్రజల ముందే చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

 

అభివృద్ధి, కార్యకర్తల సంక్షేమంపై బహిరంగ చర్చకు సవాల్ సిద్ధమా?

మంత్రి నారా లోకేష్‌పై వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకుని అభివృద్ధి, పాలన అంశాలపై దమ్ముంటే ధైర్యం ఉంటే మాట్లాడాలని సవాల్ విసిరారు.

టీడీపీ కార్యకర్తల సంక్షేమానికి నారా లోకేష్ ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలు ప్రమాదవశాత్తు లేదా ఇతర కారణాలతో మరణించిన సందర్భాల్లో వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితిని బట్టి రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించే వ్యవస్థను టీడీపీ అమలు చేస్తోందని చెప్పారు. వైసీపీ పాలనలో ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు కార్యకర్తల కోసం చేపట్టారా అని ప్రశ్నించారు.

మంత్రి నారా లోకేష్ రోజుకు 12 నుంచి 14 గంటల పాటు ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నారని, కొత్త పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకురావడం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, పార్టీ క్యాడర్‌ను బలోపేతం చేయడంలో కృషి చేస్తున్నారని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు, ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.

రాజకీయాల్లో కార్యకర్తలను ఆదుకోవడం, వారి కుటుంబాలకు అండగా నిలవడం టీడీపీ సంస్కృతి అని, అదే తమ పార్టీ బలమని పేర్కొన్నారు. వైసీపీ నాయకత్వం కార్యకర్తలను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు.

రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వ్యక్తిగత విమర్శలకు దిగకుండా, అభివృద్ధి, పాలన, రాయలసీమకు జరిగిన మేలు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలపై బహిరంగ చర్చకు రావాలని మరోసారి సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రజల ముందే టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, వైసీపీ ప్రభుత్వం చేసిన పనులపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

అదేవిధంగా, నారా లోకేష్‌పై వ్యక్తిగత వ్యాఖ్యలు కొనసాగిస్తే టీడీపీ తరఫున రాజకీయంగానే సమాధానం ఇస్తామని హెచ్చరిస్తూ, ప్రజా సమస్యలు మరియు అభివృద్ధి అంశాలపై చర్చ జరగాలని పిలుపునిచ్చారు.

 

“నన్ను, నా కార్యకర్తలను ఎవరూ అడ్డుకోలేదు”.. స్థలం నిండిపోవడంతోనే ఆలస్యం జరిగింది

 

ప్రొద్దుటూరులో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారన్న ప్రచారంపై టీడీపీ నాయకుడు ఖండించారు. ఇందులో ఏ మాత్రం నిజం లేదని వివరణ ఇచ్చారు.

కార్యకర్తలను ఉద్దేశపూర్వకంగా ఎవరూ అడ్డుకోలేదని స్పష్టం చేశారు. తాను అక్కడికి చేరుకునే సమయానికి సభా ప్రాంగణం అప్పటికే పూర్తిగా నిండిపోయిందని, లోపల స్థలం లేకపోవడంతో కొంతమందిని పోలీసులు తాత్కాలికంగా నిలిపివేశారని తెలిపారు.

ఈ విషయంపై వెంటనే సంబంధిత సబ్‌ఇన్‌స్పెక్టర్‌తో మాట్లాడినట్లు చెప్పారు. సమావేశానికి ఆహ్వానం పొందిన పార్టీ నాయకులు, కార్యకర్తలను లోపలికి అనుమతించాలని కోరగా, పోలీసులు కూడా సానుకూలంగా స్పందించి ఆహ్వానితులను ఒక్కొక్కరుగా సభా ప్రాంగణంలోకి అనుమతించినట్లు వివరించారు.

కార్యకర్తలను కావాలనే అడ్డుకున్నారనే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, సభకు ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో కార్యకర్తలు రావడంతో తాత్కాలికంగా ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. దీంతో పోలీసులు, పార్టీ నాయకులు సమన్వయంతో పరిస్థితిని చక్కదిద్దారని తెలిపారు.