SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 16 July 2026, 8:43 am Posted by : SALAM PRODDATUR

ఐదేళ్ల పాలనలో కడప జిల్లాకు జగన్ చేసింది శూన్యం–లోకేష్

–బ్రాహ్మణి స్టీల్స్ పేరుతో వేలకోట్లు దోచుకున్నారు

–ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం

–ఈనెల 24న తల్లికి వందనం నిధులను జమ చేయబోతున్నాం

–ప్రొద్దుటూరు నియోజకవర్గ టిడిపి కార్యకర్తల సమావేశంలో యువనేత నారా లోకేష్

 

సలాం ప్రొద్దుటూరు :

జగన్మోహన్ రెడ్డి రాయలసీమ బిడ్డ కాదు.. సీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ, జగన్ అధికారంలో ఉండగా కడపజిల్లాకు ఒక్క పరిశ్రమను సీమకు తీసుకురాకపోగా, ఇక్కడ సంపదనంతా అడ్డగోలుగా దోచుకున్నారని తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రొద్దుటూరు సమీపంలోని దొరసానిపల్లిలో నియోజకవర్గ టిడిపి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… బ్రాహ్మణి స్టీల్స్ పేరుతో 11వేల ఎకరాలను రూ.18వేల చొప్పున, మరో 3వేల ఎకరాలను రూ.25వేల చొప్పున భూములు తీసుకున్నారు, యువతకు 10వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక్క ఇటుక కూడా పేర్చకుండా, ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా మోసం చేశారు. ఓబులాపురం గనుల్లో విచ్చలవిడిగా ఐరన్ ఓర్ తవ్వేసి రెడ్ గోల్డ్ పేరుతో విదేశాలకు తరలించి వేలకోట్లు దోచుకున్నారు, అదే అవినీతి సొమ్ముతో  పత్రిక,టివిలను కూడా పెట్టారని దుయ్యబట్టారు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో కడపకు జగన్ చేసింది శూన్యం, చివరకు ఆయన నియోజకవర్గం పులివెందులకు నీళ్లు ఇచ్చింది కూడా చంద్రబాబేనని తెలిపారు. ఈరోజు దాల్మియా భారత్ విస్తరణ పనులకు మేం శంకుస్థాపన చేశాం, వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉండగా లీగల్ నోటీసులు ఇచ్చి అడ్డుకోవడమేగాక మామూళ్ల కోసం వేధించారని అన్నారు.

 

వారు ఫ్యాక్షన్ తెస్తే మేం ఫ్యాక్టరీలు తెస్తున్నాం

 

చంద్రబాబు నాయుడు నాలుగోసారి సిఎం అయ్యాక రాయలసీమలో ఇదివరకెన్నడూ లేనివిధంగా అభివృద్ధి జరుగుతోంది. జెఎస్ డబ్ల్యు స్టీల్ ప్లాంట్ కు ఇటీవల భూమిపూజ చేశారు, అంతకుముందు ఎస్ఎఇఎల్ రెన్యువబుల్ ఎనర్జీ ప్లాంట్ ను ప్రారంభించాం, జిల్లావ్యాప్తంగా స్మార్ట్ కిచెన్లు ఏర్పాటుచేసి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నాం. పరిశ్రమలతోపాటు హార్టికల్చర్ ను కూడా ప్రోత్సహిస్తున్నాం. గొడ్డలి పార్టీ ఫ్యాక్షనిజం తెస్తే మేం ఫ్యాక్టరీలు తెచ్చాం, రాయలసీమలో వారు రక్తాన్ని పారిస్తే, మేం ఉద్యోగాల పంట పండిస్తున్నాం. వారు అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడును ఇంటినుంచి బయటకు రానీయకుండా గేట్లకు తాళాలు వేయించారు, ఈరోజు జగన్ స్వేచ్ఛగా ఎక్కడకు వెళ్లడానికైనా అనుమతి ఇస్తున్నాం. ఇదే ప్రొద్దుటూరులో బిసి నేత నందం సుబ్బయ్యను వైసిపి హయాంలో దారుణంగా హతమార్చారు, మేం వారి కుటుంబానికి అండగా నిలిచి, వారి బిడ్డలను ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూలులో చదివిస్తున్నామని చెప్పారు.