SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 14 July 2026, 12:57 am Posted by : SALAM PRODDATUR

ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి–జిల్లా ఎస్పీ

 

 

–నిర్ణీత గడువులోగా చట్ట పరిధిలో ఫిర్యాదులు పరిష్కరించాలని అధికారులకు జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశం

సలాం ప్రొద్దుటూరు (కడప):

ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రజల నుంచి అందిన ప్రతి ఫిర్యాదును నిర్ణీత గడువులోగా చట్ట పరిధిలో పరిష్కరించాలని వైఎస్సార్ కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, ఐపీఎస్ సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించి సమస్యలను నేరుగా తెలుసుకున్నారు.

 

జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి మొత్తం 155 ఫిర్యాదులు అందాయి. ప్రతి ఫిర్యాదును స్వయంగా పరిశీలించిన ఎస్పీ, సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడి చట్టబద్ధంగా, నిర్ణీత గడువులో పరిష్కరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

 

కార్యక్రమానికి వచ్చిన వృద్ధులు, దివ్యాంగుల వద్దకే స్వయంగా వెళ్లి వారి ఫిర్యాదులను స్వీకరించిన ఎస్పీ, వారికి చట్ట పరిధిలో న్యాయం చేస్తామని భరోసా కల్పించారు. ప్రజలు పోలీసు శాఖ పరిధిలోకి వచ్చే సమస్యలపై ఎలాంటి సంకోచం లేకుండా ఫిర్యాదులు చేయాలని, ప్రతి వినతిని నిష్పాక్షికంగా పరిశీలించి పరిష్కరిస్తామని తెలిపారు.

 

ప్రజల నుంచి వచ్చిన ప్రతి ఫిర్యాదుపై సంబంధిత అధికారులతో నేరుగా మాట్లాడిన ఎస్పీ, సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం ప్రదర్శించకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు.

 

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) కె. ప్రకాష్ బాబు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎన్. సుధాకర్, డీటీసీ డీఎస్పీ అబ్దుల్ కరీంతో పాటు పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.