SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 14 July 2026, 1:04 am Posted by : SALAM PRODDATUR

అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యలు పరిష్కరించాలి– జిల్లా కలెక్టర్

 

సలాం ప్రొద్దుటూరు  (కడప):

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ద్వారా అందిన ప్రతి ఫిర్యాదును బాధ్యతాయుతంగా పరిశీలించి, అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం అందించాలని వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అన్ని శాఖల అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్ సభాభవనంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రతి అర్జీని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సూచించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. అధికారులు అలసత్వానికి తావివ్వకుండా ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి, అర్జీదారులతో మాట్లాడి వాస్తవ పరిస్థితులను తెలుసుకున్న తర్వాతే సమగ్ర నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. పొంతనలేని నివేదికలు సమర్పించడం వల్ల ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతింటుందని హెచ్చరించారు.

భూ సంబంధిత సమస్యలను రెవెన్యూ క్లినిక్‌ల ద్వారా త్వరితగతిన పరిష్కరించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించిన కలెక్టర్, తహసీల్దార్లు, శాఖాధిపతులు, పీజీఆర్ఎస్ సిబ్బంది ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి సమాచార లోపాలు లేకుండా పనిచేయాలని ఆదేశించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి పీజీఆర్ఎస్ పనితీరును నిరంతరం సమీక్షిస్తున్నారని, జిల్లాకు మంచి గుర్తింపు వచ్చినప్పటికీ అర్జీల పరిష్కారంలో మరింత మెరుగైన ఫలితాలు సాధించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల సంతృప్తి (పబ్లిక్ సాటిస్ఫాక్షన్)నే ప్రధాన లక్ష్యంగా తీసుకుని ప్రతి ఫిర్యాదును నాణ్యతతో పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ సుబ్రహ్మణ్యం, ఇన్‌చార్జి డీపీవో వెంకటసుబ్బయ్య, ఎస్‌ఎస్‌ఈ ఏపీసీ అనురాధ, డీఆర్‌డీఏ పీడీ జి. రాజ్యలక్ష్మి, డీఎస్ఓ రఘురాం, డీఎంహెచ్‌ఓ డా. రవిబాబుతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.