SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 25 June 2026, 12:17 am Posted by : SALAM PRODDATUR

రెండు చుక్కలతో.. నిండు నూరేళ్ళ రక్ష 

 

–జిల్లా టాస్క్ ఫోర్స్ సమావేశంలో.. జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి

–పల్స్ పోలియోను ప్రతిఒక్కరూ సామాజిక బాధ్యతగా చేపట్టాలి

–జూన్ 28న బూత్ లెవెల్, 29, 30వ తేదీల్లో ఇంటింటికీ తిరుగుతూ పల్స్ పోలియో కార్యక్రమం

 

–జిల్లా వ్యాప్తంగా 2404 బూత్ లు సిద్ధం

 

సలాం ప్రొద్దుటూరు (కడప):

రెండు చుక్కలతో.. నిండు నూరేళ్ళ రక్ష అని.. పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో.. ఈ నెల 28వ తేదీన నేషనల్ ఇమ్యునైజేషన్ డే సందర్భంగా.. జిల్లాలో నిర్వహించే పల్స్ పోలియో ఏర్పాట్లపై సంబందిత అధికారులతో జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి.. టాస్క్ ఫోర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..ప్రజల భాగస్వామ్యంతోనే పోలియో నిర్మూలన వంద శాతం సాధ్యం అవుతుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చర్యల ద్వారా.. దేశ వ్యాప్తంగానే కాకుండా.. జిల్లాలో కూడా పోలియోను పూర్తి స్థాయిలో నిర్మూలించగలిగామన్నారు. పోలియో వైరస్ ప్రభావం ప్రస్తుతం మన చుట్టూ లేకపోయినప్పటికీ.. ముందస్తుగా ప్రతి ఒక్కబిడ్డను పోలియో నుండి రక్షించుకోవడం మన బాధ్యత అన్నారు. “నిండు జీవితానికి రెండు చుక్కలు” అన్న నినాదాన్ని సమాజంలో విస్తృత పరచడంలో జిల్లా ప్రజారోగ్య శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, ఆశ, సచివాలయ సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

పల్స్ పోలియో కార్యక్రమంపై విస్తృత ప్రచారం భాగంగా.. మీడియా కూడా తన వంతు బాధ్యత తీసుకోవాలని తెలియజేశారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.

జిల్లాలో ఐదేళ్లలోపు వయస్సు గల 2,28,207 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడానికి కార్యాచరణ సిద్ధం చేసినట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 40 మండలాలు, 57 పల్స్ పోలియో ప్రణాళిక విభాగాల పరిధిలో మొత్తం 2,404 పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వీటిలో 2,315 స్థిర కేంద్రాలు, 57 మొబైల్ కేంద్రాలు, 32 రవాణా కేంద్రాలు ఉన్నాయని పేర్కొన్నారు.

కార్యక్రమ నిర్వహణ కోసం 9,438 మంది టీకా సిబ్బంది, 232 మంది పర్యవేక్షకులు, 232 వాహనాలను వినియోగిస్తున్నామని తెలిపారు.చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు అందేలా 4.20 లక్షల మోతాదుల పోలియో టీకాను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా 197 డేంజర్ ప్రాంతాలను ప్రత్యేకంగా గుర్తించి, అక్కడ నివసిస్తున్న 1,425 మంది ఐదేళ్లలోపు చిన్నారులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు.

గత విడతలో జిల్లాలో 100.03 శాతం లక్ష్య సాధన నమోదైందని, ఈసారి కూడా అదే స్థాయిలో విజయవంతం చేయడానికి వైద్య ఆరోగ్య శాఖ, అంగన్‌వాడీ, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. జిల్లాలోని తల్లిదండ్రులు తమ పిల్లలను సమీప పోలియో కేంద్రాలకు తీసుకువచ్చి పోలియో చుక్కలు వేయించాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుతం పోలియో మహమ్మారి ప్రభావం అంతగా లేనప్పటికీ.. కొన్ని ఊహించని సందర్భాల్లో వైరస్ సంక్రమణ జరిగే అవకాశం ఉన్నందున మనమందరం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం అన్నారు.

జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బూత్ లతో పాటు మున్సిపాలిటీల్లోని వార్డుల్లో, గ్రామాల్లో, బస్టాండులు, రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టులు, వలస కూలీలు ఉన్న చోట, పబ్లిక్ అధికంగా ఉన్నచోట పోలియో చుక్కలు వేయడం జరుగుతోందన్నారు.

జూన్ 28వ తేదీన మొబైల్ టీముల ద్వారా 29, 30వ తేదీల్లో ఇంటింటికీ వెళ్లి వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుందన్నారు. మూడు రోజుల పాటు.. ఉదయం 7 గం.ల నుండి సాయంత్రం 5 గం.ల వరకు పల్స్ పోలియో ప్రక్రియ నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ మూడు రోజులను ప్రతిఒక్కరూ అత్యంత బాధ్యతగా తీసుకుని భవిష్యత్తు తరాలకు సంపూర్ణ ఆరోగ్యకర పౌరులను అందిద్దామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులతో కలిసి జాతీయ పోలియో గోడ పత్రికను విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్ము నైజేషన్ అధికారి డా. రవిబాబు, ఐసీడీఎస్ పీడి రమాదేవి, ఆర్టీవో ప్రసాద్, రిమ్స్ సూపరింటెండెంట్ డా. వెంకటేశ్వర్లు, రైల్వే, ఆర్టీసీ, ఐఎంఏ సభ్యులు, సంబంధిత టాస్క్ఫోర్స్ కమిటీ సభ్యులు, సంబందిత శాఖల అధికారులు, ఎన్జీవోలు తదితరులు పాల్గొన్నారు.