SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 24 June 2026, 11:27 pm Posted by : SALAM PRODDATUR

లింగ నిర్ధారణ చేస్తే స్కానింగ్ సెంటర్లు, డాక్టర్ల వైద్య వృత్తి శాశ్వత రద్దుతో పాటు జైలు శిక్ష – డీఎల్‌ఎంఎంఏఏ కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి

సలాం ప్రొద్దుటూరు (కడప):

లింగ నిర్ధారణ పరీక్షలకు పాల్పడితే స్కానింగ్ సెంటర్లు, డాక్టర్ల వైద్య వృత్తి శాశ్వత రద్దుతో పాటు జైలు శిక్ష తప్పదని డీఎల్‌ఎంఎంఏఏ కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారు పేర్కొన్నారు.బుధవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో జిల్లా వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డీఎల్‌ఎంఎంఏఏ కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారి అధ్యక్షతన పీసీ-పీఎన్‌డీటీ (గర్భస్థ శిశు లింగ నిర్ధారణ, మాతా శిశు మరణాల నిర్మూలన)పై సంబంధిత అధికారులతో డిస్ట్రిక్ట్ లెవెల్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ గారితో పాటు పోక్సో జిల్లా జడ్జి ఎం.ఏ. సోమశేఖర్, పీసీ-పీఎన్‌డీటీ కమిటీ సభ్యులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ, ఆడబిడ్డను రక్షించుకోవాలంటే ఎక్కడా కూడా లింగ నిర్ధారణ పరీక్షలు జరగకుండా చేయాలన్నారు. గర్భస్రావాలు జరగకుండా ఆపాలని, అందుకోసం ప్రజల్లో విస్తృత ప్రచారం, అవగాహన కల్పించాలన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు పలు కీలక అంశాలను సమీక్షించారు. జిల్లాలో పీసీ & పీఎన్‌డీటీ చట్టం కింద నమోదైన కేంద్రాల స్థితిగతులు, కొత్త నమోదులు, పునరుద్ధరణలు, మార్పులు, మూసివేసిన కేంద్రాల వివరాలను పరిశీలించారు. అలాగే తనిఖీల నిర్వహణ, సంబంధిత దరఖాస్తుల పరిష్కారం, ప్రత్యేక తనిఖీ కార్యక్రమాల అమలుపై అధికారులతో చర్చించారు.

ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారు లింగ నిర్ధారణ పరీక్షలు, భ్రూణహత్యలు, గర్భస్రావాలు జరగకుండా ఆపాలని, అందుకోసం ప్రజల్లో విస్తృత ప్రచారం, అవగాహన కల్పించే హెల్ప్‌లైన్ పోస్టర్లను ఆవిష్కరించారు.