సలాం ప్రొద్దుటూరు :
జగనన్న కాలనీల నిర్మాణంలో ₹100 కోట్లు అవినీతి జరిగిందన్న ఆరోపణల్లో ఎలాంటి సత్యం లేదని అంతా అవాస్తవం అని.. అలా జరిగి ఉంటే సీఎం కు చెప్పి సీబీఐ విచారణ చేయించాలని రాష్ట్ర వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సవాల్ విసిరారు. సోమవారం స్థానిక మాజీ ఎమ్మెల్యే స్వగృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎం ఎల్ ఎ గా ఉన్నపుడు పేదల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం కృషి చేశానని ఇది ప్రజల కు తెలుసు అన్నారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరద, కుమారుడు కొండారెడ్డి తనపై చేస్తున్న అవినీతి ఆరోపణలను రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.
లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ:
ప్రొద్దుటూరులో 23,000 మంది లబ్ధిదారులను ఎంపిక చేయడంపై వచ్చిన విమర్శలకు ఆయన సమాధానమిచ్చారు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ద్వారా డోర్-టు-డోర్ సర్వే జరిగిందని, కంప్యూటర్ స్క్రీనింగ్ తర్వాత కమిషనర్, ఎంఆర్ఓ, ఆర్డీఓ మరియు జాయింట్ కలెక్టర్ల లాగిన్ల ద్వారా పూర్తి పారదర్శకంగా, చట్టప్రకారమే లబ్ధిదారుల ఎంపిక జరిగిందని వివరించారు. ఇందులో రాజకీయ నాయకుడిగా తన ప్రమేయం ఏమీ లేదని చెప్పారు.
భూముల కొనుగోలుపై వివరణ: ఇళ్ల స్థలాల కోసం 468 ఎకరాల భూమిని కొనుగోలు చేసే ప్రక్రియను జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా ఉన్న ఒక ఉన్నత స్థాయి కమిటీ పర్యవేక్షించిందని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే రైతులతో మాట్లాడి ధర నిర్ణయించారని, డబ్బులు నేరుగా రైతుల అకౌంట్లకే జమయ్యాయని, ఇందులో తక్కువ విలువ గల భూమికి ఎక్కువ రేటు ఇచ్చి తాను కమిషన్లు తీసుకున్నాననడం అబద్ధమని కొట్టిపారేశారు.
ఇళ్ల నిర్మాణం & కాంట్రాక్టర్లు
ఇళ్ల నిర్మాణ బాధ్యత పూర్తిగా హౌసింగ్ డిపార్ట్‌మెంట్ అధికారుల పర్యవేక్షణలోనే జరిగిందని చెప్పారు. విమర్శలు చేస్తున్న వారు పేర్కొన్న 11 మంది కాంట్రాక్టర్లలో కేవలం ఇద్దరు మాత్రమే తన అనుచరులని, మిగిలిన వారు టీడీపీ మరియు తటస్థ వ్యక్తులని పేర్కొన్నారు. ఒకవేళ తన వాళ్లు తప్పు చేసి ఉంటే కఠిన చర్యలు తీసుకోవచ్చని సవాల్ విసిరారు.
మంత్రి పార్థసారథి నియోజకవర్గంతో పోలిక: ప్రస్తుత గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి గతంలో ప్రాతినిధ్యం వహించిన పెనమలూరు నియోజకవర్గంలో కూడా సుమారు 29,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారని, అక్కడ ఎకరా భూమిని రూ. 50 లక్షల నుండి రూ. 72 లక్షల వరకు పెట్టి కొనుగోలు చేశారని పేపర్ ఆధారాలను చూపించారు. గతంలో టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు పేదలకు స్థలాలు ఇవ్వకపోవడం వల్లే, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఇంతమంది లబ్ధిదారులు వచ్చారని స్పష్టం చేశారు.
విచారణకు సిద్ధం..బహిరంగ సవాల్
ఇప్పటికే ఈ భూముల కొనుగోలుపై విజిలెన్స్ ఎంక్వైరీ జరిగిందని, అందులో తన తప్పేమీ లేదని తేలిందని చెప్పారు. ఒకవేళ ప్రస్తుత ప్రభుత్వానికి నమ్మకం లేకపోతే సీఎం చేత సిబిఐ (CBI) విచారణ వేయించాలని, తాను తప్పు చేయలేదని బహిరంగ సవాల్ విసిరారు.
అధికారుల సమక్షంలో సమీక్షకు డిమాండ్
మంత్రి కేవలం రెండు గంటలు వచ్చి వెళ్లడం వల్ల నిజాలు తేలవని, రెండు రోజులు ఇక్కడే ఉండి మీడియా, లబ్ధిదారులు (23,000 మంది మహిళలు), 146 మంది రైతులు, కాంట్రాక్టర్లు మరియు అధికారుల సమక్షంలో బహిరంగ విచారణ జరిపితే ఎక్కడైనా అవినీతి జరిగిందో లేదో ముఖాముఖి తేలిపోతుందని డిమాండ్ చేశారు