సలాం ప్రొద్దుటూరు:
దేశ రైతులకు ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం విజయవంతంగా కొనసాగుతోందని బీజేపీ ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షుడు వంకదార నరేంద్రరావు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2019 ఫిబ్రవరి 24న ప్రారంభించిన ఈ పథకం ద్వారా అర్హులైన రైతు కుటుంబాలకు ఏడాదికి రూ.6,000 చొప్పున మూడు విడతల్లో నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రారంభంలో చిన్న, సన్నకారు రైతులకు మాత్రమే పరిమితమైన ఈ పథకాన్ని అనంతరం అన్ని అర్హులైన భూస్వామ్య రైతు కుటుంబాలకు విస్తరించారని తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 9 కోట్లకు పైగా రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని, ఇప్పటివరకు రూ.3.46 లక్షల కోట్లకు పైగా నిధులను కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేసిందన్నారు. వ్యవసాయ అవసరాలు, విత్తనాలు, ఎరువుల కొనుగోలు వంటి ఖర్చులకు ఈ పథకం ఎంతో ఉపయోగ పడుతోందని, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నిధులు నేరుగా రైతుల ఖాతాలకు చేరడం వల్ల పారదర్శకత పెరిగిందని చెప్పారు. రైతుల ఆదాయాన్ని పెంచి వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందని పేర్కొన్నారు.