SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 13 June 2026, 8:18 pm Posted by : SALAM PRODDATUR

బేతానియా చర్చి వ్యవహారంలో ఉద్రిక్తతలు నివారించేందుకు పోలీసుల చర్యలు

సలాం ప్రొద్దుటూరు:

స్థానిక లోని విజయనగరం వీధిలో ఉన్న బేతానియా చర్చిలో పాస్టర్ నియామకానికి సంబంధించిన వివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది. సంఘ సభ్యులలోని రెండు వర్గాల మధ్య కొనసాగుతున్న అభిప్రాయ భేదాలు శాంతిభద్రతల సమస్యలకు దారితీయకుండా ఉండేందుకు పోలీసులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. ఈ క్రమంలో వివాదానికి సంబంధం ఉన్న 14 మంది వ్యక్తులను తహశీల్దార్ సమక్షంలో బౌండ్ ఓవర్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. భవిష్యత్తులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.

ఈ అంశంపై స్పందించిన ప్రొద్దుటూరు అసిస్టెంట్ సుపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విభు కృష్ణ, చర్చి వ్యవహారాలను కారణంగా చూపుతూ ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. వివాదాలను వీధుల్లోకి తీసుకురావడం కాకుండా న్యాయపరమైన మార్గాలను ఆశ్రయించాలని సూచించారు.

సంఘ సభ్యుల మధ్య ఉన్న అభ్యంతరాలు, అభిప్రాయ భేదాలను పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకోవడం ఉత్తమ మార్గమని పేర్కొన్నారు. అవసర మైతే న్యాయస్థానాలను ఆశ్రయించి చట్టబద్ధంగా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. పాస్టర్ నియామకం అంశాన్ని ఆధారంగా చేసుకుని ఎవరైనా ఉద్రిక్తతలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా, ఇతరులను ప్రేరేపించినా లేదా ప్రత్యక్షంగా అల్లర్లకు కారణమైనా వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చర్చి వివాదం మరింత ముదరకుండా అన్ని వర్గాలు సంయమనం పాటించి, పరస్పర సహకారంతో సమస్య పరిష్కారానికి ముందుకు రావాలని పోలీసులు కోరారు.