SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 09 June 2026, 3:56 am Posted by : SALAM PRODDATUR

మార్చురీ లో మృగం

 

_మృతదేహాలకూ తప్పని నగ్నత్వ నరకం_

సలాం ప్రొద్దుటూరు (బీదర్):

బీదర్ ‘బ్రిమ్స్’ ఆసుపత్రిలో దారుణం..
మహిళల శవాలను వివస్త్రలను చేసి మొబైల్‌లో ఫోటోలు తీసిన అటెండెంట్..
నిందితుడు మునీర్ అహ్మద్ అరెస్ట్
వైద్యుడి ఫిర్యాదుతో వెలుగులోకి కీచక పర్వం
తీవ్రంగా స్పందించిన మహిళా కమిషన్..
సుమోటోగా కేసు నమోదు..
సమగ్ర నివేదిక కోరుతూ ఆరోగ్య శాఖకు ఆదేశాలు

మానవత్వం మంటగలిసింది. చనిపోయిన తర్వాత కూడా మహిళల మృతదేహాలకు గౌరవం దక్కలేదు. కన్నబిడ్డలా, తోబుట్టువులా కాపాడాల్సిన ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలోనే ఒక కామాంధుడు మృతదేహాల పట్ల అత్యంత అనాగరికంగా ప్రవర్తించాడు._

బీదర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (బ్రిమ్స్) టీచింగ్ హాస్పిటల్‌లో ఈ ఘోరమైన ఉదంతం వెలుగు చూసింది. పోస్ట్‌మార్టం నిమిత్తం వచ్చే మహిళల శవాలను నగ్నంగా మార్చి, తన మొబైల్ ఫోన్‌లో ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్న మార్చురీ అవుట్‌సోర్సింగ్ అటెండెంట్(40) ను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.

అదును చూసి ఘాతుకం.. రహస్య ఫోల్డర్లలో ఫోటోలు

పోలీసుల కథనం ప్రకారం.. మునీర్ అహ్మద్ గత కొన్నేళ్లుగా బ్రిమ్స్ ఆసుపత్రి మార్చురీలో అటెండెంట్‌గా పని చేస్తున్నాడు. రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలు లేదా అనారోగ్యంతో చనిపోయి పోస్ట్‌మార్టం కోసం వచ్చే మహిళల శవాలపై ఈ కీచకుడు కన్నేశాడు. వైద్యులు, సిబ్బంది ఎవరూ లేని సమయం చూసి, శవాల దుస్తులు తొలగించి తన వ్యక్తిగత మొబైల్ ఫోన్‌తో నగ్న చిత్రాలను చిత్రీకరించేవాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఆ ఫోటోలను తన మొబైల్‌లోని సీక్రెట్ ఫోల్డర్లలో దాచిపెట్టేవాడు.

డాక్టర్ ఫిర్యాదుతో వెలుగులోకి..

*కొన్ని రోజులుగా మునీర్ ప్రవర్తనపై అనుమానం రావడంతో ఆసుపత్రి ఫోరెన్సిక్ విభాగం హెడ్ డాక్టర్ మోసినూల్ హక్ అంతర్గతంగా నిఘా పెట్టారు. అతడి ఫోన్‌ను తనిఖీ చేయగా ఈ దారుణం బయటపడింది. దీంతో డాక్టర్ మోసినూల్ హక్ మే 25న బీదర్ న్యూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, అతడి మొబైల్ ఫోన్‌ను సీజ్ చేశారు. అందులో అనేకమంది మహిళల శవాల నగ్న ఫోటోలు లభ్యమవడంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు.

సోషల్ మీడియాలో వైరల్.. రంగంలోకి మహిళా కమిషన్

ఈ ఫోటోలను నిందితుడు నకిలీ సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఇంటర్నెట్‌లో షేర్ చేసినట్లు సమాచారం రావడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారాన్ని కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. మహిళల గోప్యతకు, మానవ హక్కులకు భంగం కలిగించిన ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, తక్షణమే నివేదిక సమర్పించాలని రాష్ట్ర ఆరోగ్య శాఖను కమిషన్ ఆదేశించింది.

కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు

మృతదేహాల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, వైద్య నైతికతను ఉల్లంఘించడంపై పోలీసులు తీవ్రంగా స్పందించారు. నిందితుడు మునీర్ అహ్మద్‌పై భారతీయ న్యాయ సంహిత (బీ. ఎన్.ఎస్) చట్టంలోని సంబంధిత కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ దారుణంలో అతడికి ఇంకా ఎవరైనా సహకరించారా? ఈ ఫోటోలను ఎవరికైనా విక్రయించాడా? అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటనతో రోగుల కుటుంబాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.