SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 09 June 2026, 7:50 pm Posted by : SALAM PRODDATUR

చిన్నారుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుంది

సలాం ప్రొద్దుటూరు:

చిన్నారుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందనీ క్షేత్ర స్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడంలో అంగన్‌వాడీ కార్యకర్తల పాత్ర ఎంతో ముఖ్య మని వైద్యాధికారులు డాక్టర్ భరత్ నారాయణ, డాక్టర్ మధు కుమార్ నవచేతన పేర్కొన్నారు. మంగళవారం భాగంగా నిర్వహించిన శిక్షణా శిబిరంలో వారు మాట్లాడుతూ, చిన్నారుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడంలో అంగన్‌వాడీ కార్యకర్తల పాత్ర ఎంతో ముఖ్య మని అన్నారు. గర్భధారణ నుంచి తొలి వెయ్యి రోజుల కాలం శిశువు ఎదుగుదలకు అత్యంత కీలకమని, ఈ దశలో సరైన పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ అందించడం ద్వారా భవిష్యత్తులో అనేక ఆరోగ్య సమస్యలను నివారించ వచ్చని తెలిపారు. అలాగే సున్నా నుంచి ఆరు సంవత్సరాల వయస్సు గల పిల్లల అభివృద్ధిని నిరంతరం పరిశీలించడం అవసరమని సూచించారు. ప్రారంభ బాల్యాభివృద్ధి పరిశీలన ద్వారా పిల్లల్లో ఉన్న అభివృద్ధి లోపాలు, ఆరోగ్య సమస్యలు, ఇతర రుగ్మతలను ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుందని, అటువంటి వివరాలను సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో నమోదు చేసి అవసరమైన పిల్లలను జిల్లా ప్రారంభ జోక్య కేంద్రానికి పంపించడం ద్వారా వారికి సకాలంలో చికిత్స, ప్రత్యేక సేవలు అందించవచ్చని వివరించారు.

ఆధునిక సాంకేతికత, కృత్రిమ మేధస్సు వినియోగంతో పిల్లల ఆరోగ్య పరిస్థితులను మరింత సమర్థవంతంగా పర్యవేక్షించే అవకాశం ఉందని, ఇందుకు అంగన్‌వాడీ కార్యకర్తలు శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షకులు పి. శాంతమ్మ, లక్ష్మమ్మ, ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ముగింపులో అంగన్‌వాడీ కార్యకర్తలు శిక్షణలో పొందిన అవగాహనను అంగనవాడీ కేంద్రం పరిధిలో వినియోగించి చిన్నారుల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.