–ప్రొద్దుటూరులో విజిలెన్స్ అధికారుల తనిఖీలు
సలాం ప్రొద్దుటూరు:
పట్టణంలో ప్రొద్దుటూరు గృహనిర్మాణ శాఖ గోడౌన్ లో నిల్వ ఉంచిన భారీ మొత్తంలో ఐరన్ గల్లంతైన ఘటన కలకలం రేపుతోంది. రాష్ట్ర గృహనిర్మాణ శాఖకు అందిన ఫిర్యాదుల మేరకు విజయవాడకు చెందిన విజిలెన్స్ అధికారులు శనివారం ప్రొద్దుటూరులోని హౌసింగ్ గోడౌన్లను తనిఖీ చేశారు.గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జగనన్న ఇళ్ల పథకం కింద ప్రొద్దుటూరు నియోజకవర్గంలో సుమారు 24 వేల మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. వీరిలో దాదాపు 15 వేల మందికి ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసి, అవసరమైన ఐరన్, సిమెంట్, ఇసుక తదితర నిర్మాణ సామగ్రిని సరఫరా చేసింది. అయితే గోడౌన్లలో నిల్వ ఉంచిన ఐరన్‌లో భారీ మొత్తంలో కొరత ఉన్నట్లు గుర్తించారు. రాష్ట్ర హౌసింగ్ శాఖ ఆదేశాల మేరకు విజిలెన్స్ డీఈ చంద్రశేఖర్ రాజు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. జిల్లా హౌసింగ్ పీడీ రాజారత్నం, రాజంపేట ఈఈ మురళీకృష్ణ తనిఖీల్లో పాల్గొన్నారు. గోడౌన్లలోని నిల్వలు, రికార్డులను పరిశీలించిన అధికారులు ప్రాథమిక వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ డీఈ చంద్రశేఖర్ రాజు మాట్లాడుతూ, గత ఏడాది ఆగస్టులో, సెప్టెంబరులో జిల్లా పీడీ తనిఖీ చేసిన సమయంలో గోడౌన్లలో ఐరన్ నిల్వలు ఉన్నాయని తెలిపారు. అయితే ఈ ఏడాది మే నెలలో నిర్వహించిన తనిఖీల్లో ఐరన్ కనిపించలేదన్నారు. మొత్తం 270.88 టన్నుల ఐరన్ నిల్వ ఉండాల్సి ఉండగా కేవలం 2.25 టన్నులు మాత్రమే ఉన్నట్లు గుర్తించామని, మిగిలిన 268.63 టన్నుల ఐరన్ గల్లంతైనట్లు వెల్లడించారు. జిల్లా హౌసింగ్ పీడీ రాజారత్నం మాట్లాడుతూ మార్కెట్ యార్డు పరిధిలోని రూరల్ హౌసింగ్ గోడౌన్‌లో సుమారు 268 టన్నుల ఐరన్ మాయమైనట్లు నిర్ధారణ అయిందన్నారు. ఈ వ్యవహారంపై బాధ్యులైన సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు, పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని చెప్పారు. ఇదిలా ఉండగా, రూ.1.70 కోట్లకు పైగా విలువైన ఐరన్ మాయమైన ఘటనపై రాష్ట్ర హౌసింగ్ ఎండీ ప్రత్యేక విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. విజిలెన్స్ ఎస్ఈ కృష్ణయ్య ఆధ్వర్యంలో విచారణ బృందం ఏర్పాటైంది.