సలాం ప్రొద్దుటూరు :
నవచేతనతో చిన్నారుల భవిష్యత్ బలోపేతం ఏఐ ఆధారిత స్క్రీనింగ్‌తో సమగ్ర అభివృద్ధి సాధ్యమని మెడికల్ ఆఫీసర్లు భరత్ నారాయణ, మధు కుమార్ తెలిపారు. పిల్లలే మన సంపద అనే భావనతో చిన్నారుల సమగ్ర అభివృద్ధి, సంక్షేమంలో కృత్రిమ మేధస్సు సాంకేతికతను వినియోగించే విధానంపై ‘నవచేతన’ కార్యక్రమాన్ని శనివారం స్థానిక టిబి రోడ్డులోని ఎద్దుల వెంకట సుబ్బమ్మ బాలికోన్నత మున్సిపల్ పాఠశాలలో ప్రారంభించారు.ఈ సందర్భంగా శ్రీరాములపేట మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భరత్ నారాయణ మాట్లాడుతూ, 0–6 సంవత్సరాల పిల్లలలో అభివృద్ధి లోపాలు, ఆరోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించడం అత్యంత కీలకమని తెలిపారు. ఏఐ ఆధారిత ఈసీడి స్క్రీనింగ్ ద్వారా పిల్లల పరిస్థితిని ఖచ్చితంగా అంచనా వేసి, అవసరమైన వారికి తక్షణ వైద్య సేవలు అందించవచ్చని ఆయన వివరించారు. గ్రామ స్థాయిలోనే ఈ విధానం అమలు చేయడం ద్వారా పిల్లల భవిష్యత్‌ను మెరుగుపరచవచ్చని పేర్కొన్నారు.అదేవిధంగా సంజీవనగర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మధుకుమార్ మాట్లాడుతూ, 1000 రోజుల ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా పిల్లల శారీరక, మానసిక అభివృద్ధిలో గణనీయమైన మార్పులు తీసుకురావచ్చని తెలిపారు. అంగనవాడి కార్యకర్తలు యాప్ వినియోగంలో నైపుణ్యం సాధించి, ప్రతి చిన్నారి ఆరోగ్య వివరాలను సమయానికి నమోదు చేయాలని సూచించారు. అవసరమైన పిల్లలను జిల్లా ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్‌కు రిఫర్ చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించ వచ్చని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో అంగనవాడి కార్యకర్తలకు ఏఐ ఆధారిత ఈసీడి స్క్రీనింగ్, 1000 రోజుల ప్రణాళిక అమలు విధానాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్లు శాంతకుమారి, లక్షుమ్మ, ఆదిలక్ష్మి, జమీలా తదితరులు పాల్గొన్నారు.