SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 06 June 2026, 9:06 pm Posted by : SALAM PRODDATUR

టీడీపీ అధికారంలో వచ్చాక  శాంతి భద్రతలు క్షీణించాయి–మాజీ ఎమ్మెల్యే రాచమల్లు  

సలాం ప్రొద్దుటూరు :

టిడిపి అధికారంలో వచ్చాక  శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని మాజీ ఎమ్మెల్యే వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. దొరసానిపల్లెలోని ఆయన నివాసంలో శనివారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన కూటమి పాలనలో శాంతి భద్రతల పరిస్థితిపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళల భద్రత కూడా ప్రశ్నార్థకంగా మారిందని ఆయన ఆరోపించారు. ఇటీవల ఎస్ఎస్ మాల్ వ్యవహారంలో టిడిపి వర్గాల మధ్య జరిగిన రాళ్ల దాడి ఘటన తీవ్ర ఆందోళన కలిగించిందని అన్నారు. టిడిపి లోని ఇరు వర్గాల మధ్య జరిగిన ఈ ఘటనలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ వద్ద ప్రజలు గాయపడే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. అయినప్పటికీ పోలీసులు ఎవరి పైనా కేసులు నమోదు చేయక పోవడం లేదా స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వకపోవడం బాధాకరమని విమర్శించారు. గతంలో గోపవరం పంచాయతీ ఉప సర్పంచ్ ఉప ఎన్నికల సమయంలో వైసీపీ శ్రేణులపై జరిగిన రాళ్ల దాడి ఘటనను కూడా ఆయన ప్రస్తావించారు. అదేవిధంగా మార్కెట్ యార్డ్‌లో శనగల విక్రయాల అంశంపై ఆర్టీఐ ద్వారా వివరణ కోరిన పర్లపాడు చంద్ర అనే వ్యక్తికి, అలాగే టిడిపి మాజీ ఇంచార్జ్‌కు బెదిరింపు లేఖలు వచ్చినా, పోలీసులు వాటిపై సరైన దర్యాప్తు చేయలేదని ఆరోపించారు. ప్రభుత్వ ఒత్తిడి కారణంగానే కేసుల విషయంలో నిర్లక్ష్యం చూపుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాక, తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పెద్దశెట్టిపల్లెకు చెందిన ఒక ముస్లిం మహిళకు సహాయం చేసిన విషయాన్ని రాచమల్లు గుర్తు చేశారు. భర్తను కోల్పోయిన ఆ మహిళ తనను ఆశ్రయించగా, ఆమె ముగ్గురు పిల్లల విద్యాభ్యాసం కోసం పూజా స్కూల్‌లో 10వ తరగతి వరకు ఫీజులు చెల్లించడంతో పాటు బ్యాంకులో డిపాజిట్ చేసి బాండ్లు కూడా అందించానని తెలిపారు.అయితే, ప్రస్తుతం పూజా స్కూల్ సమస్యలు తీవ్రమయ్యాయని, ఆర్థిక బకాయిలు ఇవ్వాలని కోరినప్పటికీ యాజమాన్యం స్పందించకపోవడంతో బాధితులు తమను ఆశ్రయించారని అన్నారు. ఈ నేపథ్యంలో మాజీ మహిళా కౌన్సిలర్లు అక్కడికి వెళ్లి నిలదీయగా, మాజీ కౌన్సిలర్ గరిశపాటి లక్ష్మిదేవిపై కేసు నమోదు చేయడం జరిగిందని ఆయన చెప్పారు. అదే సమయంలో స్కూల్‌పై ఫిర్యాదులు చేసినా కేసులు నమోదు చేయక పోవడం పోలీసుల పక్షపాతానికి నిదర్శనమని విమర్శించారు. పూజా స్కూల్‌లో ఉద్యోగులకు జీతాలుగా ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయిన విషయంపై కూడా కేసులు నమోదు చేయలేదని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యేను సోషల్ మీడియాలో విమర్శిస్తే కేసులు నమోదు చేస్తున్నారని, కానీ ప్రభుత్వ విధానాలపై ప్రశ్నించిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆయన అన్నారు.పూజా స్కూల్ నుంచి తమకు రావాల్సిన ముస్లిం సోదరి బకాయిలు 12వ తేదీలోపు చెల్లించకపోతే, 13వ తేదీ నుంచి అక్కడే రిలే దీక్షలు చేపడతానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు వరికూటి ఓబుళరెడ్డి, గరిశపాటి లక్ష్మిదేవి పాల్గొన్నారు.