SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 06 June 2026, 12:18 am Posted by : SALAM PRODDATUR

జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు.. రేపే నామినేషన్

సలాం ప్రొద్దుటూరు (అమరావతి ):

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. జనసేన తరఫున రాజ్యసభ అభ్యర్థిగా ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ పేరును పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఖరారు చేసినట్లు సమాచారం. అధికారిక ప్రకటన సాయంత్రం వెలువడే అవకాశం ఉండగా, రేపు మధ్యాహ్నం లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.జనసేన రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ మాట్లాడుతూ, లింగమనేని రమేష్‌కు 2015 నుంచే జనసేన పార్టీతో అనుబంధం ఉందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిపై పవన్ కల్యాణ్ కలిగిన విజన్, ఆలోచనలకు ఆకర్షితుడై ఆయన పార్టీకి అండగా నిలిచారని పేర్కొన్నారు.ఇటీవల పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశంలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. పార్టీ కష్టకాలంలోనూ అండగా నిలిచిన నాయకులు, కార్యకర్తలకే పదవుల్లో ప్రాధాన్యం ఉంటుందని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. ఇప్పటివరకు ఇచ్చిన బాధ్యతలు, పదవులన్నీ పార్టీ పట్ల అంకితభావం కలిగిన వారికే కేటాయించామని, భవిష్యత్తులోనూ ఇదే విధానం కొనసాగుతుందని తెలిపారు. ఈ వ్యాఖ్యలు లింగమనేని రమేష్ ఎంపికకు పరోక్ష సంకేతాలుగా భావిస్తున్నారు.గురువారం ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఎన్డీఏ సమన్వయ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికతో పాటు రాష్ట్ర ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపై చర్చించారు.రాష్ట్రంలో ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ స్థానాల విషయంలో ఎన్డీఏ కూటమి ఇప్పటికే అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో మూడు స్థానాలను టీడీపీకి, ఒక స్థానాన్ని జనసేనకు కేటాయించాలని నిర్ణయించినట్లు సమాచారం.ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ తరఫున రాజ్యసభ సభ్యులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమళ్ నత్వానీతో పాటు టీడీపీ తరఫున రాజ్యసభకు వెళ్లిన సానా సతీష్ పదవీకాలం త్వరలో ముగియనుంది. అసెంబ్లీలో కూటమికి ఉన్న స్పష్టమైన మెజారిటీ కారణంగా ఈ నాలుగు స్థానాలు కూడా ఎన్డీఏ ఖాతాలోకి వెళ్లే అవకాశం ఉంది.ఈ నేపథ్యంలో జనసేనకు దక్కిన ఒకే ఒక్క రాజ్యసభ స్థానానికి లింగమనేని రమేష్ పేరు ఖరారవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.