SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 06 June 2026, 8:58 pm Posted by : SALAM PRODDATUR

చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఆగడాలు శ్రుతి మించితే వదిలిపెట్టం తప్పు చేసిన సొంత నేతలకూ నో ప్లేస్

సలాం ప్రొద్దుటూరు :

ప్రతిపక్ష పార్టీ శ్రేణులు తమ ఆగడాలను శ్రుతి మించకుండా చూసుకోవాలని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఊరుకునే ప్రసక్తే లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. శనివారం మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో ఏర్పాటు చేసిన టీడీపీ క్లస్టర్ ఇన్‌ఛార్జిల శిక్షణా తరగతుల ముగింపు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించే సాధారణ కార్యకర్తలను సైతం భవిష్యత్తు నాయకులుగా తీర్చిదిద్దేందుకే ఈ విధమైన ప్రత్యేక శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. “తెలుగుదేశం పార్టీకి ఇకపై ఓటమి అనేదే లేదు.. రాదు.. అనే బలమైన నమ్మకాన్ని ప్రజల్లో కల్పించేలా మేము అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కార్యకర్తలు కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా, సమాజంలో ప్రజలకు మంచి చేయాలి. తాము కూడా భవిష్యత్తులో గొప్ప నాయకులుగా ఎదగాలనే గట్టి సంకల్పాన్ని ప్రతి ఒక్కరూ తీసుకోవాలి” అని చంద్రబాబు పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులకు, నాయకులకు మరింత సహనం, ఓపిక అవసరమని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. ప్రభుత్వ పాలన, నియోజకవర్గాల్లో నేతల పనితీరుపై తాము నిరంతరం అంతర్గత సర్వేలు చేయిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. అధికార బలంతో ఎవరైనా తప్పులకు పాల్పడితే, వారు ఎంతటి వారైనా సరే సొంత పార్టీ నుంచైనా సరే వదిలించుకోవడానికి తాము వెనుకాడబోమని ఘాటైన హెచ్చరికలు జారీ చేశారు. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. నెగెటివ్ ఆలోచనలను పక్కనబెట్టి, అనుకున్న లక్ష్యాలను ఎలా సాధించాలనే సంకల్ప బలాన్ని పెంచుకునేందుకు.. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ‘ది సీక్రెట్’ అనే పుస్తకాన్ని పార్టీ కార్యకర్తలు, నాయకులు తప్పకుండా చదవాలని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సూచించారు.