SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 06 June 2026, 10:03 pm Posted by : SALAM PRODDATUR

కేవలం క్రిమినల్ కేసు ఉందని..పాస్‌పోర్ట్‌ను ఆపలేరు –తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు

 

 

 

 

సలాం ప్రొద్దుటూరు (హైదరాబాద్):

పాస్‌పోర్ట్ జారీ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఒక వ్యక్తిపై క్రిమినల్ కేసు పెండింగ్‌లో ఉన్నంత మాత్రాన, ఆ కారణంతో పాస్‌పోర్ట్ దరఖాస్తును తిరస్కరించడం లేదా నిలిపివేయడం చెల్లదని స్పష్టం చేసింది. విదేశాలకు వెళ్లడం అనేది భారత రాజ్యాంగంలోని అధికరణ 21 ప్రకారం వ్యక్తిగత స్వేచ్ఛలో భాగమని, తగిన కారణం లేకుండా దీన్ని నిరోధించలేమని న్యాయస్థానం పేర్కొంది. కేవలం ఎఫ్.ఐ.ఆర్ నమోదైనంత మాత్రాన దరఖాస్తుదారుడిని నేరస్తుడిగా పరిగణించలేమని, విచారణ దశలో ఉన్న కేసులను సాకుగా చూపి పాస్‌పోర్ట్ నిరాకరించడం చట్టవిరుద్ధమని కోర్టు అభిప్రాయపడింది. పాస్‌పోర్ట్ అధికారులు యాంత్రికంగా నిర్ణయాలు తీసుకోకుండా, నిబంధనల ప్రకారం దరఖాస్తులను పరిశీలించాలని ఆదేశించింది. క్రిమినల్ కేసులు ఉన్నవారు సంబంధిత విచారణా కోర్టు నుంచి అనుమతి పొందినట్లయితే, పాస్‌పోర్ట్ అధికారులు ఆ దరఖాస్తును ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. కేవలం పోలీసుల నుంచి వచ్చే ప్రతికూల నివేదిక ఆధారంగా దరఖాస్తును పూర్తిగా పక్కన పెట్టడం సరికాదని హైకోర్టు వెల్లడించింది. ఈ తీర్పుతో విద్య, ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లాలనుకునే వేలాది మందికి ఊరట లభించనుంది. చిన్నపాటి కేసులు లేదా విచారణలో ఉన్న కేసుల వల్ల పాస్‌పోర్ట్ రాక ఇబ్బంది పడుతున్న వారికి ఇది పెద్ద ఉపశమనంగా నిలవనుంది.