SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 04 June 2026, 10:30 pm Posted by : SALAM PRODDATUR

లింగ నిర్ధారణ పరీక్షలు చట్టవిరుద్ధం-శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్

 

PC&PNDT చట్టాన్ని పక్కాగా అమలు చేయాలి.

అనుమతి లేని స్కాన్ సెంటర్లపై కఠిన చర్యలు.

సలాం ప్రొద్దుటూరు (పుట్టపర్తి ):

శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తి కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ నందు PC&PNDT చట్టం-1994, నిబంధనలు-1996 అమలుపై జిల్లా స్థాయి మల్టీ మెంబర్ అప్రాప్రియేట్ అథారిటీ కమిటీ (DLMMA) సమావేశం గురువారం జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన అత్యంత ప్రాముఖ్యంగా నిర్వహించబడింది.ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ గారితో పాటు జిల్లా పోలీస్ ఇన్స్పెక్టర్ ఇక్బాల్,ఆర్డీటీ డాక్టర్ రఘు,డిప్యూటీ హెచ్ఇఓఎస్ రామలక్ష్మి సుశీల,ఎస్ఓ కలాధర్ తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ జిల్లాలో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నిరోధక చట్టాన్ని (PC&PNDT) అత్యంత కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. చట్టాన్ని ఉల్లంఘించి లింగ నిర్ధారణ పరీక్షలు చేసే వారిపై, ఇందుకు సహకరించే స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ నాటి DLMMA కమిటీ సమావేశంలో జిల్లా వ్యాప్తంగా వచ్చిన వివిధ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించారు.

నూతన రిజిస్ట్రేషన్లు ( జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేయదలచిన 04 అల్ట్రా సౌండ్ స్కాన్ సెంటర్ల దరఖాస్తులకు కమిటీ అధికారికంగా అనుమతులు మంజూరు చేసింది.

రిన్యూవల్స్

గడువు ముగిసిన 03 స్కాన్ సెంటర్ల రిన్యూవల్ దరఖాస్తులను పరిశీలించి, వాటి పునరుద్ధరణకు ఆమోదం తెలిపారు

మార్పులు/చేర్పులు ఉద్యోగుల మార్పిడి, నూతన పరికరాల కొనుగోలు మరియు చిరునామా మార్పులకు సంబంధించిన 04 దరఖాస్తులను కమిటీ ఆమోదించింది.

ఈ విడతలో ఎలాంటి స్కాన్ సెంటర్ల రద్దు లేదా మూసివేత దరఖాస్తులు రాలేదని కమిటీ స్పష్టం చేసింది.

మొత్తంగా ఈ సమావేశంలో 11 ప్రధాన అంశాలపై చర్చించి తుది తీర్మానాలు చేయడం జరిగింది

జిల్లాలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ అల్ట్రా సౌండ్ స్కానింగ్ సెంటర్లను సంబంధిత ప్రోగ్రామ్ అధికారులు, సబ్ డివిజనల్ అధికారులు నిరంతరం ఆకస్మిక తనిఖీలు చేయాలని, నిబంధనల ప్రకారం రికార్డులను నిర్వహిస్తున్నారా లేదా అని పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు.

హెల్త్ డిపార్ట్‌మెంట్ మరియు ఐ.సి.డి.ఎస్ సిబ్బంది సమన్వయంతో క్షేత్రస్థాయిలో గృహ సందర్శనలు చేయాలని సూచించారు. ఆడపిల్లల ప్రాధాన్యతను వివరిస్తూ, బాల్యవివాహాల నివారణ మరియు పిండ లింగ నిర్ధారణ చట్టాలపై హైస్కూల్ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మరియు ప్రజలకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.

జిల్లాలో లింగ నిష్పత్తి (Sex Ratio at Birth) గణాంకాలను కలెక్టర్ గారు పరిశీలించారు. రాబోయే రోజుల్లో ఈ నిష్పత్తిని మరింత బలోపేతం చేసేందుకు వైద్య సిబ్బంది క్షేత్రస్థాయిలో కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని పిలుపునిచ్చారు

జిల్లాలోని అన్ని స్కానింగ్ సెంటర్లలో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ (PCPNDT) చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

నిబంధనల ప్రకారం ప్రతి స్కానింగ్ సెంటర్‌లోనూ పీసీపీఎన్‌డీటీ పోస్టర్లను ప్రజలకు కనిపించేలా స్పష్టంగా ప్రదర్శించాలి. అలాగే, ప్రజలు తమ ఫిర్యాదులను తెలియజేసేందుకు వీలుగా ప్రతి సెంటర్‌లోనూ తప్పనిసరిగా ఫిర్యాదుల పెట్టె (Complaint Box)ను ఏర్పాటు చేయాలి.

స్కానింగ్ ప్రక్రియను కేవలం అర్హత కలిగిన గైనకాలజిస్ట్ లేదా రేడియాలజిస్ట్ మాత్రమే నిర్వహించాలని, ఇతరులు స్కానింగ్ చేయడానికి వీల్లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ నిబంధనలను ఉల్లంఘించే స్కానింగ్ సెంటర్లపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య డిఎంహెచ్ఓ ఫైరోజా బేగం,డెమో సుబ్రమణ్యం, డిపిహెచ్ఎన్ఓ వీరమ్మ, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.