SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 22 June 2026, 5:40 pm Posted by : SALAM PRODDATUR

మోడీ, యోగి ప్రభుత్వాల పహారా – రామ మందిరంలో గజదొంగలు ఎవరు?

–కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్ 

సలాం ప్రొద్దుటూరు :

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తి కి భక్తులు పరమ పవిత్రంగా సమర్పించిన సుమారు 200 కోట్ల రూపాయల నగదు, వజ్రవైఢూర్యాలు, విలువైన కానుకలను కాజేసిన దొంగలు ఎవరో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ,ఉత్తరప్రదేశ్ లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వెంటనే బహిర్గతం చేసి దేశ ప్రజలకు తెలియజేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్ డిమాండ్ చేశారు. కడపలోని తన కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అయోధ్యలో రామ మందిరం హుండీ ఆదాయ,వ్యయం లెక్కలలో వందల కోట్ల రూపాయల తేడా వచ్చినట్లు తీవ్ర దుమారం రేగిందన్నారు. ఈ భారీ దోపిడీ, దొంగతనం, మోసంపై యావత్ దేశంతో పాటుగా, రాములోరిభక్తులు తీవ్ర ఆవేదనకు గురయ్యారన్నారు. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ జపించే హిందువులు కూడా తీవ్రంగా కలత చెందారన్నారు. సామాన్య భక్తుడు నుండి ధనవంతుల వరకు కోట్లాది రూపాయలు దేవుడికి కానుకగా సమర్పించారన్నారు. అంతేకాకుండా శ్రీరామచంద్రుడి మెడలో హారం ఇతర ఆభరణాలు కూడా మాయమైనట్లు ప్రచారం జరుగుతోందన్నారు. కేంద్రంలో బిజెపి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారధ్యంలోని ప్రభుత్వం, ఉత్తర ప్రదేశ్ లో యోగి ప్రభుత్వాల పరిపాలనలో రామ మందిరంలో దొంగలు ఏ విధంగా పడ్డారన్న నిజాలను బయటపెట్టాలని భక్తులు కోరుతున్నారన్నారు. 1990వ సంవత్సరం నుండి ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేందుకు బాబ్రీ మసీదును విధ్వంసం చేసి, అక్కడ రామ మందిరాన్ని నిర్మించారన్నారు. అయితే ఆలయ పరిపాలన, నిర్వహణలో ట్రస్టు చైర్మన్ సంపత్ రాయ్, ఇతర ఉద్యోగుల ప్రమేయం పై విమర్శలు వస్తున్నాయన్నారు. కానీ వందల కోట్ల రూపాయల మేర ధనాన్ని లూటీ చేసిన బడా దొంగతనంలో పాలకులు ఉన్నారా, వారి ప్రమేయం ఉందా లేదా మతోన్మాదాన్ని తలకెత్తుకుని హిందువుల ప్రతినిధులుగా చలామణిఅవుతున్న ఆయా సంస్థల ప్రతినిధుల పాత్ర కీలకంగా ఉందా అనే కీలక వాస్తవాలు బిజెపి ప్రభుత్వాల ద్వారా వెలుగు చూడలేవన్నారు. కేంద్రంలోని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, తదితర కేంద్ర నేర పరిశోధన సంస్థలు విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సుప్రీంకోర్టు ద్వారా న్యాయ విచారణ చేస్తే అసలు బండారం బయటపడుతుందని డిమాండ్ చేశారు. రామ మందిరంలో దొంగలు పడినట్లు, భక్తులు సమర్పించిన నగదు, అత్యంత ఖరీదైన కానుకలు దొంగతనం పై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడంపై దేశ ప్రజలు ప్రశ్నలు సంధిస్తున్నారన్నారు. ఉత్తరప్రదేశ్ లోని బిజెపి ప్రభుత్వం నియమించిన సిట్ పై భక్తులు, ప్రజలకు నమ్మకం లేదన్నారు. ఆలయ ట్రస్ట్ చైర్మన్ 50 కోట్ల భూమి కొనుగోలు లావాదేవీలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. కానీ అక్కడ పనిచేసే ఉద్యోగులు, ఆలయ నిర్వాహకుల వెనుక ఈ భారీ దోపిడీలో ఎవరి ప్రమేయం ఉందన్న వాస్తవాన్ని ప్రజలకు వెంటనే తెలియజేయవలసిన అవసరం ఉందన్నారు. హిందూ మతం, హిందువులపై గుత్తాధిపత్యం చలాయించే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ , హిందూ ప్రచార సభ, ఇతర హిందూ సంస్థలు రామ మందిరంలో జరిగిన దోపిడీ, గజ దొంగతనం పై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఈ భారీ దొంగతనం, కుట్ర, దోపిడీని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ పలు సందేహాలు లేవనెత్తుతున్నా రన్నారు. ఆలస్యంగా వెలుగు చూసిన రామ మందిరంలో గజదొంగతనం లో బడా బాబుల పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయన్నారు. ఈ గజ దొంగతనంతో భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. రామ మందిరానికి పరమ పవిత్రంగా భక్తజనం సమర్పించిన కానుకులకు కూడా కూడా బిజెపి డబుల్ ఇంజిన్ ప్రభుత్వాల పరిపాలనలో భద్రత కరువైందన్నారు. ఈ భారీ గజదొంగతనం ఇంటి దొంగల పనే అయినప్పుడు ఇంటి దొంగలకు కొమ్ముకాస్తున్న ప్రభుత్వ పెద్దలు ఎవరు అనే సత్యాన్ని ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉందన్నారు. భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్, వీహెచ్పీ, కేవలం రాజకీయాలు చేస్తూ, హిందువులను మభ్యపెడుతూ వారి ఓట్ల ద్వారా అధికారం సాధించి మోసం చేస్తున్నారు. వారికి నిజమైన హిందూమత సంప్రదాయబద్ధమైన గుణం, ఆచరణ లేదన్నారు. హిందువులను ఓటు బ్యాంకుగా ఆర్ఎస్ఎస్ బిజెపి కలిపి వాడుకుంటున్నార న్నారు. అంతేగాని భక్తులు ఎంతో భక్తితో దేవుడికి సమర్పించే కానుకలను కైంకర్యం చేసే దొంగలను ప్రోత్సహిస్తున్నా ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం మని భక్తకోటి ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. హిందువులు ,హిందూ మతంపై భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ కు ఉన్న నిబద్ధత ఏమిటో రామమందిరం భారీ గజ దొంగతనం ద్వారా ప్రపంచానికి తెలిసిందన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు మయాన రహమతుల్లా ఖాన్, కాంగ్రెస్ పార్టీ డివిజన్ ప్రతినిధులు ఎస్. హమీద్ , కమల్ భాష తదితరులు పాల్గొన్నారు.