–అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా?
–టీడీపీ నాయకులు నంద్యాల కొండారెడ్డి సవాల్
సలాం ప్రొద్దుటూరు:
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమరావతి రాజధాని అభివృద్ధిని ఉద్దేశపూర్వకంగా నిలిపివేసి రాష్ట్ర ప్రగతిని దెబ్బతీసిందని, ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ను తిరిగి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు నంద్యాల కొండారెడ్డి అన్నారు.
ప్రొద్దుటూరులో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.వైఎస్సార్సీపీ నాయకులు అభివృద్ధిపై మాట్లాడే ముందు గత ఐదేళ్లలో రాష్ట్రానికి తీసుకొచ్చిన పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగాల గురించి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి పెట్టుబడిదారుల్లో అనిశ్చితి సృష్టించారని, మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీశారని విమర్శించారు.
రాజధాని అంటే కేవలం సచివాలయం లేదా అసెంబ్లీ భవనాలు మాత్రమే కాదని, ప్రపంచ స్థాయి రహదారులు, రైల్వే, విమానాశ్రయ అనుసంధానం, పరిశ్రమలు, విద్యాసంస్థలు, వైద్యసదుపాయాలు, ఉద్యోగ అవకాశాలు, అంతర్జాతీయ పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉండాలని పేర్కొన్నారు. అలాంటి సమగ్ర దృష్టితోనే అమరావతిని రాజధానిగా రూపుదిద్దే ప్రణాళికను చంద్రబాబు నాయుడు రూపొందించారని చెప్పారు.
గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు అనేక అభివృద్ధి పనులకు కేవలం శంకుస్థాపనలు చేసి ప్రచారం చేసుకుందని, కానీ వాటికి సరైన నిధులు కేటాయించకపోవడంతో పనులు నిలిచిపోయాయని ఆరోపించారు. అసంపూర్తిగా మిగిలిన ఇంజినీరింగ్ కళాశాలలు, పాలిటెక్నిక్ భవనాలు, రహదారులు, వంతెనలు, ఇతర ప్రభుత్వ నిర్మాణాలను ప్రస్తుత ప్రభుత్వం దశలవారీగా పూర్తి చేస్తోందన్నారు.
చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ దేశ, విదేశాల్లో పెట్టుబడిదారులతో సమావేశమై రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు, డేటా సెంటర్లు, ఐటీ సంస్థలు, తయారీ రంగ యూనిట్లు తీసుకొస్తున్నారని తెలిపారు. కడప జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి అవకాశాలు పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు.
ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేసి ప్రజాధనాన్ని వృథా చేసిన చరిత్ర వైఎస్సార్సీపీదేనని ఆరోపించిన కొండారెడ్డి, ఆ రంగులను తొలగించడానికి కూడా ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడిందని విమర్శించారు.
అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి, రాజధాని నిర్మాణం వంటి అంశాలపై ఎప్పుడైనా బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరిన ఆయన, వ్యక్తిగత విమర్శలు కాకుండా వాస్తవాల ఆధారంగా రాజకీయాలు చేయాలని వైఎస్సార్సీపీ నాయకులకు సూచించారు. రాష్ట్ర అభివృద్ధే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని, ప్రజల తీర్పును గౌరవిస్తూ ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని నంద్యాల కొండారెడ్డి స్పష్టం చేశారు.